28/09/2017
మే 20న జేఈఈ అడ్వాన్సుడ్-2018
పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పరీక్ష
ఐఐటీ కాన్పూర్‌కు నిర్వహణ బాధ్యత
కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ఆచార్య షలాబ్
ఈనాడు, హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో సీట్ల భర్తీకి జేఈఈ అడ్వాన్సుడ్-2018ను వచ్చే ఏడాది మే 20(ఆదివారం)న నిర్వహించాలని సంయుక్త ప్రవేశాల మండలి (జాబ్) నిర్ణయించింది. 2018 అడ్వాన్సుడ్ నిర్వహణ బాధ్యతను ఐఐటీ కాన్పూర్‌కు అప్పగించారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది పరీక్ష నిర్వహణ తదితర అంశాలపై మండలి ఇటీవల ఐఐటీ కాన్పూర్‌లో సమావేశమై చర్చించింది. జేఈఈ అడ్వాన్సుడ్-2018 ఛైర్మన్‌గా ఐఐటీ కాన్పూర్ సంచాలకుడు ఇంద్రనీల్ మన్నా వ్యవహరిస్తారు. పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాల్లో కీలకంగా వ్యవహరించే కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ఐఐటీ కాన్పూర్ గణితం, సాంఖ్యకశాస్త్ర విభాగం ఆచార్యుడు షలాబ్ నియమితులయ్యారు.
సమావేశంలో కీలక నిర్ణయాలవీ..
* అడ్వాన్సుడ్-18ను వచ్చే ఏడాది మే 20న(ఆదివారం) నిర్వహిస్తారు.జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణులైన 2.20లక్షలమందిని అడ్వాన్సుడ్‌కు ఎంపిక చేస్తారు.
* అడ్వాన్సుడ్ పరీక్షను దేశవ్యాప్తంగా ఒకే రోజు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. 2017 వరకు దీన్ని ఆఫ్‌లైన్(రాత)లో జరిపారు. ఈ ఏడాది ప్రశ్నల్లో తప్పులు దొర్లటంతో అందరికీ 18 మార్కులు కలపడం, దానిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో జరపాలనినిర్ణయించారు.
* ఆన్‌లైన్‌లో నిర్వహణ ఎలా, పరీక్ష విధానం తదితర అంశాలపై మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు.
పరీక్ష విధానంలో స్వల్ప మార్పులే..: ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పరీక్షా విధానంలో మార్పులు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే మొదటిసారి ఆన్‌లైన్‌లో జరుపుతున్నందున భారీ మార్పులు ఉండవని సృష్టంచేస్తున్నారు. ఆన్‌లైన్ వల్ల తప్పులు దొర్లవని, లీకేజీల సమస్య ఉండదని, ఫలితాలను వేగంగా అందివ్వొచ్చని అధికారులు చెబుతున్నారు.